Friday, December 27, 2013

kalaa Mohanam కళా మోహనం



ఎపుడో నా చిన్నప్పుడు ఉదయం పేపరు వచ్చిన రోజుల్లో ఈయన బొమ్మలు చూడ్డం మొదలెట్టాను,నామిని కథలతో నంచుకుంటూ...అతని స్ట్రొకే వేరు..ఆ రాతే వేరు,ఆ రంగులే వేరు..ప్రత్యక్షంగా కలిసిందైతే లేదు అయినా ఎందుకో మరి మోహన్ గారంటే మరి అదోరకమైన భక్తి...ఎప్పుడూ కలవని నేనే ఇన్ని మాటలు చెప్తూ ఉంటే ఎప్పుడూ వెంటనుండే వారి భక్తుల మాటలు చూడండి
========
Anwar:
 
Naresh Nunna:

మోహన్‌కి అరవై మూడేళ్లు! !
అందమైన వాక్యం (అన్న భ్రమ)లో చెప్పాలంటే... మోహన్‌కి అరవై మూడు వసంతాలు!!
            ఇంతకంటే విచిత్రమైన,విపరీతమైన,విడ్డూరమైన వాక్యంనా దృష్టిలో మరొకటి లేదు. ఈ విరిగిన కుర్చీ కొని పదేళ్ళు, నా పదవీ విరమణకి ఇంకా నాలుగు సంవత్సరాలు,ఆ కూలిన బ్రిడ్జికట్టి గట్టిగా పుష్కరమైనా అయితేనా... ఇలాంటివే కాదు మరికొన్ని అర్థవంతమైన వాక్యాల్నిచెవికెక్కించుకోగలను. ఇంకా జియాలజిస్టులు పళ్లూడిన రాళ్ళ వయసు, బోటనిస్టులు గూడు జారినచెట్ల ఆయుష్షు..... అన్నేళ్లు....ఇన్ని శిశిరాలు...అంటూ లెక్కలు కడుతుంటారు. అవేవీతప్పని, నేరమనీఅనిపించదు గానీ, మోహన్‌కి ఈడొచ్చిందనో, జోడుకు వయసొచ్చిందనో....అంటూంటే ఆశ్చర్యమేస్తుంది.
            అక్కడెక్కడో మహాశూన్యంలోమన అగణిత బుర్రలకి ఊహకైనా అందని మహావేగంతో భూమండలం చేస్తున్న ఆత్మప్రదక్షణలకి,సూర్యచంద్రుల ఋజువర్తనాచమత్కారాల కనుగుణంగా ఎగిరే కాలం రెక్కలకి ఖగోళ గందరగోళాల లెక్కలు వేలాడదీశాం,మన దుర్భలత్వానికిచిహ్నంగా. ఆ లెక్కల జమాబందీ ఉచ్చుల్లో చిక్కుకుని, గడియారాలు పంచాంగాల్లో ఇరుక్కున్నఏళ్ళూపూళ్లు, వారాలూ వర్జ్యాలు, ఘడియలు-విఘడియలతో 'సమయా'నికి తగు 'తాళం' వేస్తుంటాం, మన దిక్కుతోచనితనానికి గుర్తుగా.అంతమాత్రం చేత ఎంత అల్పత్వాలున్నప్పటికీ, 'తగుదునమ్మా అని మోహన్ వయో పరిమితుల్ని, ప్రాయ- చిత్తాల్ని కొలిచేయశఃకాయకల్ప చికిత్సకి తెగబడతామా? ఏకాంతాన్ని భగ్నం చేసే, చైతన్యాన్ని నిలువరించే,మధుమోహాల్ని రద్దుపరిచేవస్తువులు, స్థలాలు, రాళ్లురప్పలకి గానీ, అటువంటి జడపదార్థాల్లానే బతికేస్తున్న మనుషులకేమో గానీ,మోహన్ వంటి చైతన్యశీలికివయస్సేమిటి?
ఆయన 'కాలం' మనకి తెలిసిన, అర్థమైన కాలం కాదు. 'టైమ్'కి మాత్రమే కాదు, ఆయన 'టెన్స్'కి కూడా సాధారణ వ్యాకరణార్థంలో తెలిసిన భూత,వర్తమాన, భవిష్యత్ అర్థాలు లేవు.చూరునుంచి ఒక్కొక్కటిగా జారి ఇసుకలో ఇంకిపోతున్న వానచుక్కని ఒంటరిగా పట్టి 'కాలనాళిక 'లో ఒకసారి పరీక్ష చేయాలి.అందులో కదలాడే ఆయన టెన్స్‌ని. అది గతించిన గతమా? తళుక్కుమనే తక్షణమా? ఆగామి అగమ్య గోచరమా?ఈ మూడు కలగలిసిపోయిన  ఫోర్త్ పర్సన్ సింగ్యులర్‌లా, ఫోర్త్ డైమన్షన్ ఇన్విజిబుల్లాంటి హ్యుమన్ టెన్సా?
ఇసుక డొంకల్లో నగ్న పాదాల్తో చేతిలోని ఇప్పపూల దోనెతో పరుగులు తీస్తున్నప్పడు అందులోంచిచిందిపడే తేనేబిందువుల తుళ్లింతను పోలిన హ్యుమన్ టెన్స్‌తో సంతులితమైన క్షణాలు. ఆ క్షణాలసమాహారమే మోహన్. అందుకే, 365 తేదీలుగా రద్దయిపోయే కేలండర్‌లో 'డిసెంబరు 24' అన్న ఒక్క రోజుమాత్రమే 'పుట్టిన రోజు ' పేరిట ఆయనకి సంబంధించినదనిఅనడం విడ్డూరంగా ఉంటుంది.
            వ్యావహారిక పరిభాషలో మోహన్ఒక చిత్రకారుడు, కార్టూనిస్టు, యానిమేటర్, ఇంకా మంచి రచయిత, చింతనాశీలి. ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఆర్టిస్టు గురించి రెండుముక్కలు రాయడానికైనా కొంత అర్హత అవసరం. రాత- గీత రంగాలలో పాత్రికేయ స్థాయి ఉపరితల అవగాహనైనాఉండాలి. ఆంధ్ర దేశంలో ఆర్టు గురించి తెలిసిన అతిమైనారిటీ వర్గానికి చెందకపోయినా,అధిక సంఖ్యాకులకిఉండే బండ బలమున్నా చాలు. పువ్వుల నేవళం గురించి తెలియకపోయినా, వాటిని గుదిగుచ్చిన దారాన్నివిడిచిపెట్టని మొండితనమున్నా చాలు. ఆ బండ, మోండితనంతోనే నా ఈ వ్యాసమనే ఉపరితల విన్యాసం: మోహన్అనే 'అసలు'గురించి కాదు,మోహనీయమనే 'కొసరు' గురించి. 'మోహనీయమంటే మోహన్ తనమే,అదే దారం అనే motif.
సుమారు పాతికేళ్లు (మధ్య మధ్యలో విరామాలున్నప్పటికీ) దాదాపుగా ఆయనను రోజూ చూస్తూనేఉన్నాను. అరికాళ్ల అంచున అలల ఘోష నిరంతరాయంగా ఉన్నా, కడుపులో చల్ల కదలనట్టుగా ప్రశాంతంగాతోచే సముద్ర గర్భాన్ని రోజూ చూసినా ఏం అర్థమవుతుంది? గుండుసూది కూడా దూరని రాతి ఒంపుల్లోకిఉలిని పరుగులెత్తించి మలచిన మహాశిల్పాన్ని నిత్యం చూసినంత మాత్రాన ఏం తెలుసుకోగలం?అందులోనూ ఎన్ని పరిమళాల్తోనుఎదురొచ్చి ఆహ్వానించినా పరిచయమున్న పూలమొక్కంటే చులకన ఉన్నట్లు, పరిచయమైన కొద్దీ మనుషులుకూడా చవకవుతారు. అయినా 'రోజూ చూస్తూ ఉండటం' అనే బోడి క్వాలిఫికేషన్‌తోనే రాయక తప్పడం లేదు.
పైన ఇంతకుముందు ఏదో నాన్ సీరియస్ స్థితిలో, ఒక ఊపులో 'చైతన్యశీలి ' అన్న విశేషణం వాడేశాను గానీ,మోహన్ ఎంతమాత్రం చైతన్యశీలికారు. ఒక సాధారణ అర్థంలో రక్తమాంసాలు, కామక్రోధాలు ఉన్న మనిషే కాదు. ఆయన ఒక phenomenon గామారిపోయారు కాబట్టి తరచి చూడకపోతే, ఆయనని పైకి స్థితప్రజ్ఞుడంటూనే జడుడని, enigmatic అంటూనే కొరకరానికొయ్యని అంటాం. పెదాల్తో నవ్వుతూ నొసట్లతో వెక్కిరించే అల్ప మానుషత్వంతోనే ఆయన స్నేహశీలిఅని, ఆపద్భాంధవుడనిరకరకాల ముసుగు పేర్లతో శ్లాఘిస్తాం. మనఃశరీర సంబంధిత రాగద్వేషాల్లోనే రెండు కాళ్లునిలిపి, కుదుళ్ళుజొనిపి, మామూలుకంటికి కనిపించని సృజనాత్మక సౌందర్యం, తాత్విక సృజనావరణాల్లోకి తన మూర్తిమత్వపు శాఖోపశాఖల్నిచాపి విస్తరించిన మహావృక్షాన్ని పెరట్లో చెట్టులా చూస్తే అసలు రూపం ఎప్పటికీ బోధ పడదు.కుదుళ్ళకి, కొమ్మలకి ఉన్న బంధంలాంటి అంతర్నిహిత ప్రసారం ఒకటి ఆ వృక్షం లోపల జరుగుతుంటుంది.వేర్లలోని భౌతిక శక్తిని కొమ్మల్లోని ఆదిభౌతిక సత్తాలో అనుసంధానించడమనేది మోహన్‌లోనిరంతరం జరిగే ప్రక్రియ. అటువంటి మానవాతీతమైన అనుభవం వల్ల నిత్యమైన సృజనశీలిలో అన్నిభావోద్వేగాలు ఒక ఉచ్ఛస్థాయికి వెళ్లిపోతాయి. సుఖదుఃఖాలు, బాధానందాలు, వెలుగుచీకట్లు, నలుపుతెలుపుల వంటి ఎన్నోవిరోధాభాసలకి అందని ఒక ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాయి. అటువంటి ఆర్టిస్టులు ఏ ఉద్యమాల్నినడపరు; 'ఎయిడ్స్నుంచి రక్షణగా కండోమ్స్ వాడండ'ని జనాల్ని మేలుకొలపరు; 'కల్లుమానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్'అని పిలుపులివ్వరు;ఒక భార్య,ఒక జాణ, ఒకే బాణమని సుద్దులు చెప్పరు.........దేనితో తలపడరు, దేనినీ మార్చరు. వాళ్లు చైతన్యశీలమైన ప్రవాహాలు కానే కాదు, ప్రవాహ గతిని మార్చే నిశ్చలమైనరెల్లు దుబ్బులు. సమాజాన్ని మార్పు దిశగా నడిపించే నాయకులకి స్ఫూర్తి దాతలు!
ఇటువంటివారు ముక్కుమూసుకుని ఏ గుహాంతర్భాగాల్లో ఉన్నా వారి ప్రభావం మాత్రం అమేయం.కానీ మోహన్ అలా అజ్ఞాతంగా, అజ్ఞేయంగా ఉండేవారేం కాదు. ఆయన మీద ప్రేమతో రకరకాల సందర్భాల్లోవ్యాసాలు రాసిన వారి ప్రకారం, మోహన్ ఒక గ్యాంగ్‌లీడర్. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయనడెన్ ఎప్పడూ కోలాహలంగా ఉంటుంది. ఆయన తన పరివారం, బంధుగణం శిష్య ప్రశిష్యుల మధ్య పరివేష్టితులైఉంటారు. ఈ నిత్యకృత్యం లాంటి దృశ్యంలో అబద్ధం లేదు, దృశ్యాల్ని అన్వయించుకోవడంలో తేడాఉందేమో. నాతో సహా ఆయన బంధుమిత్ర సపరివారమంతా మోహరించి ఉన్నప్పడు, ఒక అనంతమైన విషాదం ఆ దృశ్యంమంతాపిగిలి పొర్లిపోతుంటుంది. ఈ ప్రపంచగతిని మార్చే నెత్తురు మండే శక్తులు నిండే సైనికుల్నిపుట్టించి, ఎగదోయగలిగిన ఆర్టిస్టు ఒక వీల్‌ఛైర్‌లో కూర్చొన్న సాధారణ భంగిమలో మామూలు కంటికికన్పిస్తూనే, వేరే ఉన్నతపార్శ్వంలో యోగముద్రలో ఉన్నప్పడు ఆ టేబుల్‌కి ఇటుపక్కన ఆ planeకి ఏ మాత్రంసంబంధంలేని ఒక పోచుకోలు గుంపు ఉండటం-
                         - ఒక దుర్భర విషాద దృశ్యం!
            మానుష స్థాయిలో మోహన్‌లోకొన్ని తెంపరి లక్షణాలు ఉన్నాయి (లేదా ఉన్నాయని నా పరిశీలనా ఫలితం). స్థిర,లేదా చర సంపదల పట్లపూర్తి వైముఖ్యం, అధికారం, హోదాల పట్ల మహా నిర్లక్ష్యం, స్వోత్కర్ష ఏ రూపంలో లేకపోవడం, పొగడ్తల పట్ల చెడ్డ యావగింపు, .....ఇంకా వ్యక్తీకరణల్లోకి ఇమడనిప్రేమా బాధ్యతల్ని వర్షించడం, చదువుకి- జ్ఞానానికి వంతెనలు వేసుకునే బాల్య కౌమార తృష్ణల్నిసజీవంగా నిలుపుకోవడం మొదలైనవి మరెన్నో. ఇన్ని దశాబ్దాలుగా ఆయన చుట్టూ తిరిగే ఏ ఒక్కరికీఈ లక్షణాల్లో ఏ ఒక్కటి సావాసదోషంతోనైనా అంటుకోకపోవడం విచిత్రమైతే, అసలా లక్షణాల ఉనికే వారికితెలియక పోవడం మరోవిచిత్రం. దొంగ మర్యాదలు, కుర్చీని బట్టి గౌరవాలు, అవసరార్థం అరదండాలు....వంటి లౌకికనైచ్యాన్ని తన పరిసరాల్లోంచి పూర్తిగా నిషేధించాలని ఆయన చేసిన అకర్మక క్రియ వంటి అప్రయత్నప్రయత్నం మరోలా వికటించింది. అదేదో సినిమాలో 'ఈ పూట మనం ఫ్రెండ్స్' అని ప్రొఫెసర్ అన్న వెంటనే'సరే సోడాకలపరా' అనికుర్ర స్టూడెంట్లు చనువుతీసుకున్నట్లు, భేషజాలు లేని వాతావరణం ఉండాలని మోహన్ ఆశిస్తే,ఆకాశమంత ఎత్తున ఉన్నఆయన భుజంమీద చెయ్యేసి, వారివారి స్థాయి ఊకదంపుడు ఉపన్యాసాలకి ఆయన్ని శ్రోతని చేసి,కోటలు దాటే ఆ కోతలతోఅంతులేని కాలహరణం చేస్తుంటారు.

ఇవన్నీ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది- ఆయన అలిగి కూర్చున్నారేమోనని. అలిగిన వారినిబుజ్జగించడం దగ్గరవాళ్ళకి ఒక ముచ్చట, ఒక మురిపెం, అంతకు మించిన బాధ్యత. అయితే అలిగినట్లేఅర్థంకాక పోవడం కంటే దురదృష్టం మరేముంది? 'నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ము లేదు...' అని దిగులు పడటంకంటే మించినదురదృష్టం. నాలుగు దశాబ్దాల పై చిలుకు ఆయన చేస్తున్న సంతకం ఆయనది కాకపోవడం,అది ఒట్టి ఫోర్జరీసంతకమని ఎవరికీ పట్టకపోవడం ఎంత అన్యాయం! నీకోసం, నా కోసం మరేదో జెండా కోసమో గీసినగీతలు కాకుండా, తనకోసం తాను గీసుకున్న బొమ్మలెన్నో, గీయాలనుకున్న బొమ్మలెన్నెన్నో! ఎగ్జిబిషన్ల పేరిటో,కేలండర్ల కిందనో తనవైనఆ బొమ్మల్ని ప్రదర్శించుకోవడం చెడ్డ చిరాకు ఆయనకి. కే.సి.డే మధుర స్వరాన్ని పందుల గురగురలు,వాహనాల చీదుళ్ళ మధ్యవినడానికి చలం పడిన చికాకులాంటిదది. అంకార్ వాట్, రామప్ప దేవాలయం....ఇంకా ఎన్నో మహోన్నతమైనచిత్ర, శిల్పకళాఖండాల దిగువున ఏ సంతకాలున్నాయని ఎదురు దెబ్బలాడతారు మోహన్. సంతకం చేయకపోవడమే భారతీయతఅంటారు. ఇది కాళిదాసు విరచితమని, కవి నృప జయదేవ కృతియని, ఇంకా ఎందరో కవులు పద్య, శ్లోక మకుటాల్లో చేసిన సంతకాల్నిచూపించి, 'ఇవి భారతీయం కాదా మోహన్!' అని దబాయించి, ఆయన దాచుకున్నవి బయటకు లాగొచ్చు, ఆయన చేత బలవంతాన నిశానిముద్రలేయిస్తూ.

అయితే అంత కంటే ముందు ఆ స్థాయి ఆర్టిస్టు ప్రతి ఒక్కరికీ తమని ఏకాంత పరిచే ఒక అనంగరాగాన్నివినే వెసులు బాటు కల్పించాలి. ఆ  labyrinth of solitude లో కళాకారుడు చిక్కుకుపోవాలి; అలా చిక్కుకుపోయే సావకాశం ఏర్పాటుచేయాలి- నిజమైన బంధుమిత్ర సపరివారం. అప్పడే సృజనకి అవకాశం. అలా లేనప్పడు ఏ కళాకారుడైనామోహన్‌లానే అలుగుతాడు. ఆయన అలక తీర్చేవాళ్ళలో కాకుండా, దానికి కారణమైన గుంపులో నేనొక్కడ్నిఅయినందుకు నన్ను ఎంతో కక్షతో ఐనా క్షమించుకోగలనా?
============


Kandukuri Rameshbabu :
మనిషి Mohan Artist
.............................
మోహన్ గారి పుట్టినరోజు రెండు ముక్కలైనా రాయకుండా ఉండలేక ....

+++

మనకు గొప్ప చిత్రకారులు ఉండవచ్చు. అద్బుతమైన మనుషులు ఉండవచ్చు. కానీ మనుషులుండటం ఎంత అద్భుతం!

కేవలం మనిషి.
పేరుంది గనుక వారిని మోహన్ గారని పిలుస్తున్నాం గానీ ఆయన జస్ట్ ఎ మ్యాన్ కైండ్.

దీన్ని వివరించి చెప్పడం చాలా కష్టం.
అయినా ప్రయత్నస్తాను. ఎలా అంటే, ఆయన నేరుగా మనిషితో వ్యవహరిస్తాడు.
కులం, మతం, లింగం, ప్రాంతం, ధనం, ఇటువంటివేవీ లేకుండా మనిషితో నేరుగా ఆయన ఉంటాడు. ఆ మనిషితో పూర్తిగా అంగీకారంతో ఉంటాడు.

కావాలంటే మీరు వెళ్లండి. మీకేం కావాలో అడగడు. మీరెవరు, ఎక్నడ్నుంచి వచ్చారు, ఏం కావాలో అడగరు. తెరిచిన తలుపులతో ఆయన సదా అందుబాటులో ఉంటారు. తనవద్దకు
అలా వచ్చి అట్లా ఉండిపోయిన మనుషులు కూడా చాలా మందే ఉన్నారు. అయినా ఆయన మారలేదు. మనిషి మారలేదు.

+++

మళ్లీ చెప్పాలంటే, ఆయన కేవలం మనిషి. వివరించి చెప్పాలంటే, తాను మీతో మాట్లాడుతున్నాడంటే వారికి మీ వ్యక్తిత్వం నచ్చో కానక్కరలేదు. నచ్చక పోయినా మాట్లాడుతాడు. నచ్చడం, నచ్చక పోవడం. అభిరుచులు కలవడం, కలవకపోవడం అన్నదాంతో సంబంధం ఏమీ లేదు. నిజానికి, అవేవీ లేకుండాను, మానవ సంబంధాల్లో ఏదో ఒక ఆశింపు ఉంటుంది చూడండి. అలాంటిదీ కనీసం లేశమాత్రం కూడా లేకుండా వారు మనతో బిహేవ్ చేస్తారు.జీవిస్తారు. కేవలం మనిషిగా బతుకుతారు. అంతే. అదీ ఆయన విశేషం. అంతకుమించి ఇంకేమీ లేకపోవడమే మోహన్!

+++

ఒక మనిషి ఒక మనిషితో నెరిపే సంబంధ బాంధవ్యాలకు అతనొక నిజ వ్యక్తిత్వం. అంతకన్నాఇంకేమీ లేదు.

+++

తనకు పెద్దవాడూ చిన్నవాడు... ధనికా పేదా... ఆడా మగా...పరిచితుడూ అపరిచితుడూ...గురువూ శిష్యుడూ...ఇటువంటి వేవీ ఉండవు. ఆయనకు మనిషి వినా మరేదీ అక్కర్లేదు.

ఆ మనిషి తనతో పని చేయించుకుంటాడని తెలుసు. అయినా ఫరవాలేదని ఊరుకునే తాత్వికత ఆయనది.

మనుషులు దోచుకుంటారని కూడా తెలుసు. అయినా దోపిడీకి గురవుతున్నామన్న చర్చోపచర్చలు లేని స్థితప్రజ్ఞత వారిది.

కేవలం ఒక పిడికిలి.

ఆయనకైనా మరో మనిషికైనా అంతకన్నా'సొంత ఆస్థి' ఇంకేదీ ఉండదని తాను బలంగా భావిస్తారేమో! బహుశా ఆ పిడికిలి తప్పా ఆయన ప్రపంచానికి ఇచ్చింది ఇంకోటి లేదనే అనుకుంటాను, నేనైతే!

+++

పోరు బాటలో ఒక పిడికిలి.
కుడి ఎడమలతో సంబంధం లేదు.
వామపక్షం వాళ్లడిగినా చంద్రబాబు అడిగినా ఇచ్చాడు.
తన సాహిత్యం అదే అన్నట్టు, నోరు తెరిచి ఎవరు అడిగినా సరే, తల పంకించి ఆ బొమ్మ వేసిచ్చారు, ఇస్తూనే ఉన్నారు.

అది కూడా తానూ ఒక మనిషిని అన్న ఎరుకతోనే తప్పా అదొక గొప్ప అచీవ్ మెంట్ అని కూడా ఆయన అనుకోరు.

ఇంత సింపుల్ మనిషిని నేనూ ఊర్లో ఒకరిద్దర్రే చూశాను.
అదృష్టం అంటే నాది.

+++

చిత్రమేమిటంటే, మోహన్ గారు మనుషులకు సంబంధించి వాళ్ల పూర్వపరాలు, స్థితిగతులతో సంబంధం లేకుండా వ్యవహరించడం. అదే ఆయన! ఇంత బతికినా మనిషి మారలేదు.

బహుశా అందరికీ అందుబాటులో ఉండటం మనకు బాగుంటుంది. తలలో నాలుకలా మెసలడం మనకు బాగానే ఉంటుంది. ఓ మనిషి తనకోసం తాను ఆలోచించకపోవడం కూడా ఎవరికైనా హాయిగా ఉంటుంది. కానీ ఆయన ఇంతమంది మనుషులను భరిస్తూ మనిషిగానే ఉండగలగడం నాకు ముచ్చటేసే సాహిత్యం.

ఒక సారి, నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభపు రోజుల్లో మోహన్ గారు ఒకరిద్దరు మనుషులను పంపారు. వారి గురించి ఎన్నో సార్లు వాకబు చేశారు. "పనైందా లేదా?'' అని ఆరా తీశేవారు. ఒక రోజు "వాళ్లు మీ మిత్రులా?'' అని అడిగితే, "లేదబ్బా...ఏమో! ఎవరో ఏమో!'' అన్నారు.

మరొకసారి ఆయన ఎవరితోనో ఇష్టంగా మందు సేవిస్తున్నారు.
చాలా సేపటికి తెలిసింది, వారి సంభాషణల్లో...
వాళ్లూ తానూ అపరిచితులు...

అదీ ఆయన పద్ధతి. అపరిచుతులైనా పరిచితులైనా ఒకటే.

+++

వాళ్లు ఏం కోరిక కోరినా సరే, అది ఉద్యోగంలో పెట్టివ్వమనడం కావచ్చు, బొమ్మ వేసి పెట్టడం కావచ్చు. పుస్తకం గురించి కావచ్చు. యానిమేషన్ కావచ్చు.

అది పది పైసల కార్యం కావచ్చు, కోటి రూపాయల వ్యవహారం కావచ్చు.

ఏదైనా ఒకటే. అడిగిన వాళ్లకు ఆ అర్హత ఉందా లేదా అన్న విచారణ తనకు లేదు.
ఆ పని చేయడం తప్పా అందుకు ఇంకే హేతువూ తనకు అక్కర్లేదు.

మరో మాటలో చెబితే, అవతలి వాడు మనిషిగా ఏం అడిగితే దానికి ప్రతిస్పందనగా ఈ మనిషి వ్యవహరించడం! ఇంతకుమించిన అద్భుతం నేనూ ఈ భూమ్మీద చూడలేదు!

నీ పుట్టిన రోజు నిజంగా మనిషి పుట్టిన రోజే...

~మోహనన్నకు ప్రేమతో....


===-==================-============-=========-=======-=========-======-=-==
Mrityunjay_cartoonist

మోహన్ బొమ్మంటే మోహం! 
ఎనిమిదో తరగతిలో ‘అందెవేసిన చేయి’ని సొంత వాక్యం చేయమని శారద టీచర్ అడిగితే ‘రాజకీయ కార్టూన్లు గీయడంలో మోహన్‌ది అందెవేసిన చేయి’ అని రాస్తే మార్కులు బరాబర్ పడ్డాయి. పుస్తకాల్లో ఉన్న విషయాలకంటే పుస్తకాలకు వేసిన అట్టలపై వున్న మోహన్ ‘ఉదయం’ కార్టూన్లనే ఎక్కువ స్టడీ చేశా. నిజానికి అట్టలపై నా కార్టూన్లు స్టడీని పుస్తక పాఠాలు నన్నెప్పుడూ డిస్ట్రబ్ చేయలేదు. పిట్టలదొర వేషంలో వున్న ఎన్టీఆర్ ముందు ఇంగ్లీషు పాఠం ‘ఒజిమాండియాస్’ వెలవెలబోయేది. రాజీవ్‌గాంధీ చిరిగిన చెడ్డీ ‘పోస్టాఫీస్’ కార్టూన్ దెబ్బకు ‘డేవిడ్ కాపర్ ఫీల్డు’ ఫీల్డు వదిలేసి దౌడు తీసేవాడు. ముద్దు, బొద్దుగా, తీరొక్క వేషాల్తో వుండే ఎన్టీఆర్ క్యారికేచర్ గారిని ఎంత ప్రేమించానో. మా ఊళ్ళో పాత పేపర్ల షాపులన్నీ తిరిగి తిరిగి మోహన్ గీసిన ఎన్టీఆర్ ‘ఉదయం’ పేపర్లు ‘రెండు రూపాయలకు’ కిలో చొప్పున కొన్న రోజులున్నాయి.
టెన్త్, ఇంటర్, డిగ్రీ అయ్యాక మోహన్ కోసం వేటమొదలయ్యింది. మా అమ్మానాయినలను వదిలేసి మోహన్ గీసిన బొమ్మల కట్టలను మోసుకుంటూ పట్నం వచ్చా. ఎర్రపిడికిలి పోస్టర్ అడ్రస్ ఎక్కడ అనడిగితే ‘రెడ్’ హిల్స్ అన్నాడు ఆర్టిస్టు సూరి. కాంక్రీటు అరణ్యకాండ మొదటి అధ్యాయంలోనే రెడ్‌హిల్స్ మెడ్ ఆర్సీ పక్కన అల్లనేరేడు చెట్టుకింద నాకు మోహన్ పరిచయం కావడం ఈ రాయి అహల్యగా మారిన ఘట్టం.
ఆంధ్రభూమిలో కార్టూన్లు గీస్తూ తన ఫ్లాట్‌లో మూడేళ్ళ సావాసంలో బోలెడు జ్ఞాపకాలు, జోకులు, ప్రసంగాలు. ‘‘డబ్బుల కోసమే అయితే కార్టూన్లే ఎందుకు గీయాలబ్బా, చిట్‌ఫండ్ కంపెనీ పెట్టుకోవచ్చు గదబ్బా’’ అని మందలించినా, టీజీఎస్ జార్జ్ వ్యాసాలు చదవని మీది ఒక బతుకేనా? అని మొట్టికాయలేసినా, జయదేవ్ పుస్తకానికి ముందు మాటలో నాతోటి సోదర సోదరీమణులను ‘బ్రష్షు కొంచెం-బలుపు ఘనం’ లాంటి వ్యాసంతో తిట్టినా నేనైతే హర్ట్ అయిన దాఖలాలైతేలేవు. ఎందుకంటే మోహన్ బొమ్మంటే మోహం!
అనాటమీ, అటానమీ మధ్య బొత్తిగా తేడా తెలుసుకోకుండా ఊళ్ళనుంచి స్కూల్ డ్రాపవుట్ పిలగాండ్లు పత్రికల మీద గెరిల్లా దాడులు చేస్తూ పొలిటికల్ కార్టూన్లు గీస్తున్నారన్నా కంప్లైంట్ మా మీద వుంది. ‘‘ నా అజ్ఞానం వల్ల వేరెవరికీ హాని కలగనప్పుడు నాకొచ్చిన నష్టం ఏమిటి?’’ అన్న పతంజలిగారి కొటేషన్ నన్ను ముందుకు నడిపించింది.
అలాగే మోహన్ గణవ్యవస్థ, బానిస యుగం, రాచరికాలు, ఫ్యూడల్, పెట్టుబడీదారి దండకాలను నేను బేఖాతారు చేస్తూ కూరలోకి మసాలాలు కొనుక్కోవడం, ట్యూషన్ ఫీజులు కట్టుకోవడానికి తగిన సమగ్ర రాజకీయ అవగాహనకు మించి ఇంచ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
ఇక గద్దర్ అనగానే ముందు స్ఫురించేది మోహన్ రాసిన కత్తుల్లాంటి లెటర్సే. ఆతర్వాతే గద్దర్ ముఖము. చిత్ర ప్రసాద్ బొమ్మలు చూసిన అనుభవంలేని రోజుల్లో ఆయన ప్రేరణతో మోహన్ గీసిన సాయుధ తెలంగాణ యోధుల డ్రాయింగ్స్ నాకు పరిచయం. తెలంగాణ సాయుధ పోరాటం ఫొటోలు తీసిన సునీల్ జానాను పరిచయం చేసిందీ మోహనే.
మోహన్ ప్రజల ఆర్టిస్టు. ఆయనది ప్రాపగాండ కళ. ఉద్యమాలు, ఊరేగింపులకు పోస్టర్లు వేసినందువల్లా, విప్లవ పుస్తకాల అట్టలపై బొమ్మలు వేసినందు వల్లా కార్టూన్లలో ఈ ఉద్యమాలని డిఫెండ్ చేసినందువల్ల ఇలాంటి గుర్తింపు వచ్చిందనుకోవచ్చు. కానీ, ‘కళ పుట్టింది ఏ రాజకీయ ఉద్యమాల కోసమో, సిద్ధాంతం కోసమో కాదంటాడు. ఆదిమానవులు గుహల గోడలమీద బొమ్మలు వేశారంటే ఏదో సిద్ధాంతాన్ని ప్రచారం చేద్దామని కాదు, కళ పుట్టుక, స్వభావం, పరమార్ధం గురించి మార్క్సిస్టు మేధావులు, మార్క్సిస్టేతర మహా మేధావులు పరిశోధించారంటాడు మోహన్.

అవతార్ సిన్మా పాత్రలకు ప్రేరణ రామాయణంలోని మన దేవుళ్ళే అన్నాడు జేమ్స్ కేమరూన్. మరీ గట్టిగా అడిగితే అవతార్ క్యారెక్టర్ డిజైన్లకు స్ఫూర్తి మరో ప్రమదగణం ‘మోహన్’ అని ఖచ్చితంగా కక్కేవాడేమో. అవును -నాకు తెలిసినంతవరకు పండోరా గ్రహవాసుల ముఖ వర్చస్సు, దేహ భాష ముమ్మాటికీ మోహన్ శైలే.

స్టీవెన్ స్పీల్ బర్గ్ టీంలో పనిచేసిన ఓ ఆర్టిస్టు నాతో అన్న మాటలు.. ‘‘గీసే వేలాది రఫ్ గీతల్లో (స్క్రిబుల్స్) ఒకే ఒక్క పర్‌ఫెక్ట్ లైన్ దాగుంటుంది. ఖచ్చితంగా దాన్నే పట్టి ఫైనల్ గీతగా ఖరారు చేయడం ఆర్టిస్టు ప్రతిభ’’ కానీ, మోహన్ మొదటి ప్రయత్నంలో గీసే లైనే ఫైనల్ గీత అని చెబితే ఆశ్చర్యపోయాడు.

రెండున్నర దశాబ్దాలుగా తెలుగు డైలీల్లో వచ్చిన ఒక తరహా హ్యూమర్, కార్టూన్ సంప్రదాయం బ్రేక్ అవ్వాలని మోహన్ ఆశ - అయ్యే సూచనలేవీ దగ్గర్లో కనిపించడం లేదన్న ప్రగాఢ అనుమానమూనూ - అవును అదేదో ఆయనే చేసి చూపించాలని మా డిమాండు.

జీవితాన్ని, ప్రపంచాన్నీ ఏ ఒక్క కోణంలోనుంచో చూడడం ఇష్టంలేని మోహన్ విజయవాడ నుంచి, హైద్రాబాద్‌కు - మగ్దూం భవన్ నుంచి, సాక్షి చానల్‌కు - విశాలాంధ్ర పత్రిక నుంచి తెలంగాణ ఉద్యమ పోస్టర్ల వరకూ సాగిన పయనం విభిన్నమైనది. ఉత్కంఠభరితమైనది.
పోస్టర్లతో, రాతలతో తలపండిన మేధావులను, కార్టూన్లతో పాఠకులను, యానిమేషన్లతో కుర్రకారుని కిక్కెక్కించే మోహన్ ఓస్కూలు, ఓ యూనివర్సిటీ, ఓ శరణాలయం, ఓ కలాష్నికోవ్ తుపాకి.

[ఏంటబ్బా.. నా పుట్టిన రోజునాడే నన్నిలా చావగొట్టావేం? అనొచ్చు.. తన వందో పుట్టిన రోజున చక్కటి వ్యాసం రాసి దగ్గరుండి చదివిస్తానని హామీ ఇస్తున్నా.. ఇప్పుడు ఇంతకు మించి ఈ పాల బుగ్గల పసిపిట్ట కొండంత మోహన్ గురించి ఏం కూయగలదు?]
-మృత్యుంజయ్

No comments:

Post a Comment